Nitish Kumar Reddy: యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి మంత్రి లోకేశ్ అభినందనలు

- ఇవాళ ఉండవల్లి వచ్చిన యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి
- ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ తో మర్యాదపూర్వక భేటీ
- నితీశ్ ను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించిన లోకేశ్
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వాడి సత్తా చాటిన నితీశ్ ను మంత్రి లోకేశ్ అభినందించారు. రాష్ట్రంలో యువ ఔత్సాహిక క్రీడాకారులకు నితీశ్ స్పూర్తిగా నిలిచాడని కొనియాడారు. నితీశ్ ను మంగళగిరి చేనేత శాలువా, జ్ఞాపికతో మంత్రి సత్కరించారు.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని అన్నారు. అయితే అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు.
నితీశ్ వెంట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీశ్ తదితరులు ఉన్నారు.
నితీశ్ ఇవాళ ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబును కలవడం తెలిసిందే. చంద్రబాబు చేతుల మీదుగా నితీశ్ రూ.25 లక్షల చెక్ అందుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో నితీశ్ సెంచరీ సాధించడంతో ఆంధ్రా క్రికెట్ సంఘం రూ.25 లక్షల నజరానా ప్రకటించింది.



