Nitish Kumar Reddy: యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్ అందించిన సీఎం చంద్రబాబు

- ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి రాణించిన నితీశ్
- సెంచరీతో మెరిసిన తెలుగు క్రికెటర్
- రూ.25 లక్షల నజరానా ప్రకటించిన ఏసీఏ
- నేడు చంద్రబాబు చేతుల మీదుగా చెక్ బహూకరణ
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి నేడు సీఎం చంద్రబాబును కలిశాడు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి నితీశ్ నేడు ఉండవల్లి వచ్చాడు. చంద్రబాబు చేతుల మీదుగా రూ.25 లక్షల చెక్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా టూర్లో నితీశ్ కుమార్ రెడ్డి వీరోచితంగా ఆడి సెంచరీ నమోదు చేయడం తెలిసిందే. దాంతో ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అతడికి రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ నజరానా చెక్ ను నితీశ్ కుమార్ రెడ్డికి అందించారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.
"విశేష ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ మన నితీశ్ కుమార్ రెడ్డిని నేడు కలిశాను. తెలుగు సమాజం నుంచి వెలుగులు విరజిమ్ముతున్న నికార్సయిన ధ్రువతార నితీశ్. తన ఆట ద్వారా ప్రపంచ వేదికపై భారత్ కు గర్వకారణంలా నిలిచాడు. నితీశ్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో మద్దతుగా నిలుస్తున్న అతడి తల్లిదండ్రులను అభినందించాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సెంచరీలు సాధించాలని, మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, నితీశ్ తనను కలిసిన ఫొటోలు కూడా పంచుకున్నారు.



