Pothina Mahesh: తాగు, తిను, ఊగు... సంక్రాంతికి కూటమి ప్రభుత్వం చేసింది ఇదే: పోతిన మహేశ్

- సంక్రాంతి సంబరాలను ఆర్గనైజ్ట్ క్రైమ్ గా మార్చారన్న పోతిన మహేశ్
- కోడి పందేల్లో మహిళా బౌన్సర్లను కూడా పెట్టారని విమర్శ
- పందేలను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్న
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుందని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శించారు. సంక్రాంతిని అడ్డం పెట్టుకుని వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. సరదాగా జరిగే సంక్రాంతి సంబరాలను కేసినో స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోడి పందేల బరులను ఏర్పాటు చేశారని... పందేల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు.
జూదం అధికారికమే అనే విధంగా సంక్రాంతి సంబరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చేశారని చెప్పారు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించారని మండిపడ్డారు. తాగు, తిను, ఊగు అనే విధంగా సంక్రాంతిని కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగులు పెట్టారని విమర్శించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా కోడి పందేల్లో పాల్గొన్నారని మహేశ్ విమర్శలు గుప్పించారు. కోడి పందేల్లో మహిళా బౌన్సర్లను కూడా పెట్టారని మండిపడ్డారు. కోడి పందేలు ఆడుకోవచ్చని హోం మంత్రి అనిత పర్మిషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గోదావరి జిల్లాలకు దీటుగా కృష్ణా జిల్లాలో 320కి పైగా కోడి పందేల బరులు ఏర్పాటు చేశారని మహేశ్ చెప్పారు. స్కూళ్ల ప్రాంగణాల్లో కూడా బరులు ఏర్పాటు చేశారని అన్నారు. ఇదేం పాలన అని చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ని జనాలు తిట్టుకుంటున్నారని తెలిపారు. అశ్లీల నృత్యాలను ప్రమోట్ చేయడమేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. పవన్ చెప్పే సనాతన ధర్మం అంటే... కోడి పందేలు, పేకాట, గుండాట ఆడటమేనా? అని అడిగారు. కోడి పందేలను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.