Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పోస్టర్‌ను విడుదల చేయడంపై బండి సంజయ్ విమర్శలు

- ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని బండి సంజయ్ వ్యాఖ్య
- మోసపూరిత హామీలతో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లి ఓడిపోయిందని వెల్లడి
- తెలంగాణలో విఫలమైన మాదిరే ఢిల్లీలోను హామీలు విఫలమవుతాయని జోస్యం
తెలంగాణలో ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గతంలో హర్యానా, మహారాష్ట్రలలోనూ ఎన్నికలకు వెళ్లి ఓటమి చవి చూసిందని, ఇప్పుడు ఢిల్లీలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హామీల ప్రచార పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదలపై బండి సంజయ్ స్పందించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ పార్టీ ఓటమికి టిక్కెట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చిందని, వాటిని అమలు చేయలేదన్నారు. ఆ హామీలను చూపిస్తూ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారని విమర్శించారు.
ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఘనమైన హామీలు తెలంగాణలో ఇచ్చిన హామీల మాదిరిగా విఫలం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో మరో ఓటమి ఎదురు చూస్తోందన్నారు.