KA Paul: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

KA Paul hot comments on Revanth Reddy

  • రేవంత్ రెడ్డి కట్టిన పన్నులతోనే ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మించిందన్న పాల్
  • మోదీ, రేవంత్ రెడ్డిలను ఎదుర్కొనే సత్తా తనకే ఉందని వ్యాఖ్య
  • రెడ్ల పార్టీలలోని బీసీలు బయటకు రావాలని పిలుపు

రేవంత్ రెడ్డి తెలంగాణలో వసూలు చేసిన పన్నులతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని పడగొట్టి... బీసీ రాజ్యాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. ఈరోజు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదన్నారు.

వరంగల్‌లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనను అడ్డుకున్నారని ఆరోపించారు. తాను సదాశివపేటను అభివృద్ధి చేసినట్లుగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలకు సూచించారు. వంద రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.

కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఇన్వెస్టర్లను పక్కన పెట్టి అదానీకి అన్నీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

రెడ్ల పార్టీలలోని బీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొందామన్నారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి గెలుస్తుందని, తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమన్నారు.

  • Loading...

More Telugu News