Jeeva Samadhi: కేరళలో జీవ సమాధి కలకలం... మృతదేహాన్ని బయటికి తీసిన పోలీసులు

Police brings out dead body of Gopan Swamy alleged Jeeva Samadhi in Kerala

  • కేరళలో ఓ వ్యక్తి జీవ సమాధి అయినట్టు వార్తలు
  • హైకోర్టు ఉత్తర్వులతో సమాధిని తవ్విన పోలీసులు
  • పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలింపు

కేరళలో ఓ వ్యక్తి జీవ సమాధి అయినట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యక్తి పేరు గోపన్ స్వామి. తిరువనంతపురంకు చెందిన గోపన్ స్వామి జీవ సమాధిలోకి వెళ్లారంటూ ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. ఈ మేరకు పోస్టర్లు వేశారు. 

అయితే గోపన్ స్వామి జీవ సమాధి అయ్యాడన్న విషయం బంధువులకు, స్థానికులకు తెలియకపోవడంతో ఈ వ్యవహారం అనుమానాలు రేకెత్తించింది. దీనిపై గోపన్ స్వామి కుమారులు రాజేశన్, సనందన్ స్పందిస్తూ... తాను జీవ సమాధి అయ్యేటప్పుడు ఎవరూ చూడరాదని తమ తండ్రి చెప్పాడని, అందుకే తాము ఎవరికీ చెప్పలేదని వెల్లడించారు. 

ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల వరకు వెళ్లడంతో, సబ్ కలెక్టర్ ఆల్ ఫ్రెడ్ ఓవీ రంగంలోకి దిగారు. తిరువనంతపురంలోని నెయ్యటింకర వద్ద ఉన్న ఓ దేవాలయం సమీపంలో గోపన్ స్వామి జీవ సమాధి అయినట్టు కుటుంబ సభ్యులు చెప్పగా.... ఆ సబ్ కలెక్టర్ పోలీసుల సాయంతో ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆ సమాధిని తవ్వుతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 

దాంతో, హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న అధికారులు... భారీగా పోలీసులను రంగంలోకి దింపి తవ్వకం కొనసాగించారు. సమాధి లోపల కూర్చుని ధ్యానం చేస్తున్న స్థితిలో గోపన్ స్వామి మృతదేహం కనిపించిందని, సమాధిలో ఆయన ఛాతీవరకు పూజా సామగ్రితో నింపారని పోలీసులు వెల్లడించారు. కాగా, గోపన్ స్వామి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News