Virat Kohli: బీసీసీఐ యూ-టర్న్.. టీమిండియా ప్లేయర్లకు ఇక కష్టాలే!

A report has claimed mandatory yo yo fitness Test rule could be brought back for Players

  • తిరిగి ఫిట్‌నెస్ పరీక్షలను తప్పనిసరి చేయాలని భావిస్తున్న బీసీసీఐ పెద్దలు
  • విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న నాటి యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని యోచన
  • ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీమ్‌కు సమాచారం ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు
  • ఆటగాళ్ల వరుస వైఫల్యంగా ఆగ్రహంగా ఉన్న క్రికెట్ బోర్డ్

ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియా అనూహ్య రీతిలో ఓటముల బాట పట్టింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో అవమానకర ఓటమిని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో, బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు సైతం విఫలమవ్వడంపై సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో అమలు చేసిన ఫిట్‌నెస్ టెస్ట్ రూల్స్‌ను తిరిగి తప్పని చేయాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం.

గతంలో యో-యో ఫిట్‌నెస్ తప్పనిసరిగా ఉండేది. అయితే, ఆటగాళ్లకు తీరికలేకపోవడం, మరోవైపు రెగ్యులర్ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఫిట్‌నెస్ టెస్ట్‌ని రద్దు చేసింది. అయితే, ఈ నిబంధనను బీసీసీఐ తిరిగి ప్రవేశపెట్టవచ్చని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఫిట్‌నెస్‌కు సంబంధించి పాత ప్రమాణాలకు తిరిగి వెళ్లాలంటూ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌కు ఇప్పటికే ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారని వెల్లడించింది.

కాగా, ఆటగాళ్లు రెగ్యులర్‌గా గాయాల బారిన పడుతుండడంతో యో-యో టెస్ట్ నిబంధనలను గత మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. ‘‘ఆటగాళ్లు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి, చూసీచూడనట్టు వదిలేశారు. గాయాల నివారణపై దృష్టి పెడుతూ ఈ విధమైన స్వేచ్ఛ ఇచ్చారు. అయితే, కొందరు ఆటగాళ్లు దీనిని బాగా లైట్ తీసుకున్నారు. అందుకే ఒక నిర్దిష్ట స్థాయి ఫిట్‌నెస్ ప్రమాణాలను తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది’’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్టు సమాచారం.

మరోవైపు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భార్యల బస విషయంలో కూడా బీసీసీఐ కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులు వారి వెంట వెళ్తే ఆటపై ప్లేయర్ల దృష్టి మళ్లుతోందని, ప్రదర్శనపై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. మరి బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News