Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు ఎన్నంటే..!

- స్థిరచరాస్తులు అన్నీ రూ.1.7 కోట్లు మాత్రమేనట
- సొంత కారు లేదన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి
- భార్య సునీత పేరు మీద రూ.1.5 కోట్ల ఆస్తులు
ఐఆర్ఎస్ ఆఫీసర్ స్థాయి నుంచి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ కు సొంతంగా ఒక్క కారు కూడా లేదట.. స్థిరచరాస్తులు అన్నీ కలిపి తనకున్న ఆస్తుల విలువ కేవలం రూ1.7 కోట్లు మాత్రమేనట. వచ్చే నెల జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేస్తూ కేజ్రీవాల్ ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఆస్తుల వివరాలు ఇవీ.. నగదు రూపంలో రూ.40 వేలు, రూ.3.46 లక్షల విలువైన చరాస్తులు, రూ.1.7 కోట్ల విలువైన స్థిరాస్తులు. మొత్తం కలిపి రూ.1.73 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు.
భార్య సునీతకు రూ.32 వేల నగదు, రూ.కోటి విలువైన చరాస్తులు, రూ.1.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై 13 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, విచారణ దశలో ఉన్నాయని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, 2020 ఎన్నికల నాటి అఫిడవిట్ లో కేజ్రీవాల్ తనకు రూ.9.95 లక్షలు, భార్య సునీత పేరుమీద 57 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన పేరుమీద రూ.1.77 కోట్లు, భార్య పేరుమీద రూ.1 కోటి విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. సొంత ఇల్లు కానీ సొంత కారు కానీ లేవని కేజ్రీవాల్ పేర్కొనగా.. సునీత మాత్రం 2017 మోడల్ మారుతి బాలెనో కారు నడుపుతారు.