Revanth Reddy: ఏపీతో నీటి కేటాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
- నీటి పారుదల శాఖపై సీఎం సమీక్ష
- ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం
- వివిధ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెబుతూ చంద్రబాబు సహా పలువురికి లేఖలు రాయాలని సూచన
- పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశంపై అధ్యయనం చేయించినట్లు వెల్లడి
రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఈరోజు నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... నీటి కేటాయింపులపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర జల్ శక్తి శాఖ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకీ లేఖలు రాయాలని ఆదేశించారు.
ఏ నది పైన అయినా ప్రాజెక్టును నిర్మించాలంటే పొరుగు రాష్ట్రం అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మనకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశంపై ఐఐటీ విద్యార్థులతో అధ్యయనం చేయించినట్లు చెప్పారు. అలాగే, తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టులకు అనుమతులు సాధించే దిశగా పనులు వేగవంతం చేయాలన్నారు.