Manchu Manoj: నేనొక్కడిని చాలు.. ఒక్కొక్కడిని తరిమి కొడతా: మంచు మనోజ్
- గొడవ పడటానికి తాను యూనివర్శిటీ వద్దకు రాలేదన్న మనోజ్
- తన తల్లికి బ్రెయిన్ వాష్ చేశారని మండిపాటు
- ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపణ
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఈరోజు హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. యూనివర్శిటీలోకి వెళ్లేందుకు వచ్చిన మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆర్డర్స్ కారణంగా లోపలకు అనుమతించబోమని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు బౌన్సర్లకు, మంచు మనోజ్ బౌన్సర్లకు మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు కొట్టుకుంటూ, రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మనోజ్ మాట్లాడుతూ... తాను గొడవ పడటానికి ఇక్కడకు రాలేదని... తాత, నానమ్మ సమాధులకు దండం పెట్టుకునేందుకు వచ్చానని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు తనను ఇంట్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
తన తల్లికి బ్రెయిన్ వాష్ చేశారని... పేపర్ల మీద మ్యాటర్ రాసి ఆమెతో సంతకం చేయించారని మనోజ్ తెలిపారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారని... ఆమెకు ఏమీ తెలియదని చెప్పారు. తాము వస్తున్నామని తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. తానొక్కడిని చాలని... ఒక్కొక్కరిని తరిమి కొడతానని అన్నారు.
మరోవైపు, ఈ సాయంత్రం యూనివర్శిటీలోకి మనోజ్ ను పోలీసులు అనుమతించారు. తన భార్య మౌనికతో కలిసి తాత, నానమ్మ సమాధులకు ఆయన దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.