Nara Lokesh: లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో చాలా మంది జైలుకు వెళతారు: నారా లోకేశ్
- రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న లోకేశ్
- కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
- ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపడతామని వెల్లడి
కనుమ పండుగ వేళ ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో త్వరలోనే చాలా మంది జైలుకు వెళతారని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. నారావారిపల్లెలో ఉన్న నారా లోకేశ్ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని లోకేశ్ చెప్పారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపునిస్తామని తెలిపారు. నేతలు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. త్వరలోనే బూత్ లెవెల్ నుంచి పార్టీని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఇకపై పార్టీ కోసం అధిక సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు.