Atishi: ఢిల్లీ సీఎం అతిశీ ఆస్తులు ఎంతంటే..!
- తన ఆస్తుల విలువ రూ. 76,93,347గా పేర్కొన్న అతిశీ
- కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ సీఎం
- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ కూడా నామినేషన్లు వేశారు.
అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ తరపున అల్కా లాంబా, బీజేపీ నేత రమేశ్ బిధూరి ఎన్నికల బరిలోకి దిగారు.
తన ఆస్తుల విలువ రూ. 76,93,347గా అతిశీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని తెలిపారు. తనకు కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందని చెప్పారు. తనకు సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు. రెండు పరువునష్టం కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
అల్కా లాంబా తనకు రూ. 3.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.