Cybercrime: పండుగపూట సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్
- సంక్రాంతి గిఫ్టులు అంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారని హెచ్చరిక
- ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ పేరుతో మోసం చేస్తారన్న శిఖాగోయల్
- అవసరమైతే 1930కి కాల్ చేయాలని సూచన
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, గిఫ్టులు అంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే ప్రయత్నం చేస్తారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్, నకిలీ వెబ్ సైట్ల ద్వారా భారీ తగ్గింపు అని చూపించి మోసం చేస్తారని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు గిఫ్ట్ కార్డు మోసాలు, ఫేక్ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లను ఉపయోగిస్తారని సూచించారు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా, వాట్సాప్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. ప్రయాణ టిక్కెట్లను, గిఫ్టులు, షాపింగ్ వంటి పండుగ ఆఫర్లను చూసి గుడ్డిగా మోసపోవద్దని, వాటిని అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారానే కొనుగోలు చేయాలన్నారు. ఎవరైనా మోసపోతే 1930కి ఫోన్ చేయాలని లేదా 'సైబర్ క్రైమ్ డాట్ గవ్' కు రిపోర్ట్ చేయాలన్నారు.