BJP: ఢిల్లీ సీఎం అతిశీ ఇప్పుడు జింకలా పరుగెడుతున్నారు: బీజేపీ నేత బిధూరీ
- ఢిల్లీని అతిశీ ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శ
- ఎన్నికల వేళ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారన్న బిధూరీ
- తాను సీఎం రేసులో లేనన్న రమేశ్ బిధూరీ
నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలు పట్టించుకోని అతిశీ ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు జింకలా పరుగెడుతున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిధూరీ విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో వీధుల పరిస్థితిని చూస్తే ఢిల్లీ సమస్యలను అతిశీ ఎప్పుడూ పట్టించుకోలేదని అర్థమవుతోందన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారన్నారు.
తాను ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే ప్రచారంపై కూడా బిధూరీ స్పందించారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. తాను పోటీలో లేనని తేల్చి చెప్పారు.
కాగా రమేశ్ బిధూరీ ఇటీవల వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు, బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించారు. అతిశీపై అంతకుముందు కూడా ఆయన ఓసారి విమర్శలు చేశారు. అతిశీ ఇంటిపేరు మార్చుకుందని గతవారం వ్యాఖ్యానించారు.