IND Women vs IRE Women: భ‌ళా అమ్మాయిలు.. వ‌న్డే చ‌రిత్ర‌లోనే భార‌త్‌ బిగ్గెస్ట్ విన్‌!

IND Women won by 304 runs

  • రాజ్‌కోట్ వేదిక‌గా ఐర్లాండ్, భార‌త్ మ‌ధ్య‌ మూడో వ‌న్డే
  • 304 ప‌రుగుల తేడాతో భార‌త్ భారీ విజ‌యం
  • 50 ఓవ‌ర్ల‌లో 435 ర‌న్స్ చేసిన భార‌త మ‌హిళా జ‌ట్టు
  • 130 పరుగుల‌కే ఆలౌట్ అయిన ఐర్లాండ్ టీమ్‌
  • శ‌త‌క్కొట్టిన‌ ప్ర‌తీకా రావ‌ల్ (154), స్మృతి మంధాన (135) 
  • మూడు మ్యాచుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా

రాజ్‌కోట్ వేదిక‌గా ఐర్లాండ్ మ‌హిళా జ‌ట్టుతో జ‌రిగిన‌ మూడో వ‌న్డేలో భార‌త మహిళా జ‌ట్టు భారీ విజ‌యం న‌మోదు చేసింది. ఏకంగా 304 ప‌రుగుల తేడాతో గెలిచి భార‌త మ‌హిళల‌ వ‌న్డే క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ విన్‌ను న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 435 ర‌న్స్ చేసింది. 436 ప‌రుగుల భారీ ల‌క్ష్యఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ కేవ‌లం 130 పరుగుల‌కే ఆలౌట్ అయింది. 

భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఐర్లాండ్‌కు ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో ఫోర్బ్స్ 41, ఓర్లా 36 ర‌న్స్‌తో ప‌ర్వాలేద‌నిపిస్తే.. మిగ‌తా ప్లేయ‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 3, త‌నుజా 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... సంధు, మిన్ను మ‌ణి, స‌యాలీ త‌లో వికెట్ తీశారు.  

అంత‌కుముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట‌ర్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఐర్లాండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌, ప్ర‌తీకా రావ‌ల్ బౌండ‌రీల వ‌ర్షం కురిపించారు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు ఏకంగా 233 ప‌రుగుల రికార్డుస్థాయి భాగ‌స్వామ్యం అందించడం విశేషం. ఇద్ద‌రూ కూడా శ‌తక్కొట్టారు.

ప్ర‌తీకా రావ‌ల్ (154), స్మృతి మంధాన (135) భారీ సెంచ‌రీలు బాదారు. అలాగే రిచా ఘోశ్ 59, తేజ‌ల్ 28, హ‌ర్లీన్ 15 ర‌న్స్‌ చేశారు. దీంతో 50 ఓవ‌ర్ల‌లో భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 435 ప‌రుగుల భారీ స్కోర్‌ చేసింది. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో ఓర్లా 2 వికెట్లు తీయ‌గా... ఫ్రేయా, కెల్లీ, డెంప్సీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

ఇక ఈ విజ‌యంతో టీమిండియా మూడు మ్యాచుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 3-0తో సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌', 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్' రెండు కూడా ప్ర‌తీకా రావ‌ల్‌కే ద‌క్కాయి. 

  • Loading...

More Telugu News