KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు.. స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas satires on KTR

  • కేటీఆర్‌కు హైకోర్టులో మాత్రమే కాదు.. సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలిందన్న ఆది
  • దమ్ముంటే ఇప్పుడు లొట్ట పీసు కేసు అనాలని సవాల్
  • అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన నలుగురే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శ

ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చుక్కెదురు కావడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్‌కు హైకోర్టులో మాత్రమే కాదు... సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలిందని, దీంతో అటు గోడ దెబ్బ, ఇటు చెంపదెబ్బలా ఆయన పరిస్థితి తయారయిందని ఎద్దేవా చేశారు. తనపై లొట్టపీసు కేసు పెట్టారంటూ కేటీఆర్ మాట్లాడారని, దమ్ముంటే ఇప్పుడు ఆ మాటలు మాట్లాడాలని చురక అంటించారు.

ఈ-కార్ రేసింగ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, అలా చేయాలనుకుంటే తమ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారని విమర్శించారు.

గవర్నర్ అనుమతితో ఏసీబీ, ఆ తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే లొట్టపీసు కేసు అని మాట్లాడటం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన నలుగురే ఇప్పుడూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్, గొర్రెలు, చేపల కుంభకోణాలపై దర్యాఫ్తు జరుగుతోందన్నారు. కోర్టులకు వెళ్లి విచారణ ఆపాలని చూసినా నిజం నిప్పులాంటిదన్నారు. మీరు చేసిన పొరపాటుతో దేవుడు కూడా మీ పక్షాన లేరన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు.

  • Loading...

More Telugu News