Manchu Vishnu: నారా లోకేశ్ ను కలిసిన మంచు మనోజ్
- నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్, ఆయన భార్య మౌనిక
- సమావేశానంతరం రంగంపేటలో జల్లికట్టు పోటీలను వీక్షించనున్న వైనం
- ఈ ఉదయం మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశారు. తన భార్య మౌనికతో పాటు నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్ లోకేశ్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మనోజ్ దంపతులు రంగంపేటకు వెళ్లి జల్లికట్టు పోటీలను వీక్షించనున్నారు.
మరోవైపు, ఈ ఉదయం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి నారావారిపల్లె వరకు మంచు విష్ణు, మంచు మనోజ్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను నిన్న తొలగించారు. సుమారు వందకు పైగా ఫ్లెక్సీలను తీసేశారు.
ఈ ఉదయం యూనివర్శిటీ వద్దకు మనోజ్ వస్తున్నాడనే సమాచారంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో యూనివర్శిటీ వద్దకు వెళ్లిన మనోజ్ ను పోలీసులు ఆపేశారు. న్యాయస్థానంలో కుటుంబ వివాదం కేసు ఉన్న నేపథ్యంలో లోపలకు అనుమతించబోమని మనోజ్ కు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మనోజ్ అక్కడి నుంచి వెనుతిరిగారు. నేరుగా నారావారిపల్లెకు చేరుకున్నారు.