Director Shankar: గేమ్ ఛేంజర్: ఆ విషయంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్'
- ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
- ఈ మూవీ రన్‌టైం విషయంలో తాను సంతృప్తిగా లేనన్న దర్శకుడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్‌లలో రన్ అవుతుంది. అయితే, ఈ మూవీ రన్‌టైంకి సంబంధించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శంకర్ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా రన్‌టైం విషయంలో. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.