Rahul Gandhi: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే: రాహుల్ గాంధీ
- అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన రోజునే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న మోహన్ భగవత్
- దేశ ప్రజలను అవమానించారన్న రాహుల్ గాంధీ
- ఇలాంటి పిచ్చి మాటలు కట్టిపెట్టాలని హితవు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందంటూ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి.
ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని చెప్పారు. దేశంలో మన రాజ్యాంగ సిద్ధాంతం, ఆరెస్సెస్ భావజాలం మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. 1947లో మనకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పి దేశ ప్రజలను మోహన్ భగవత్ అవమానించారని దుయ్యబట్టారు. బ్రిటీష్ వారిపై పోరాడిన మన యోధులను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటాన్ని ఆపాలని అన్నారు.