Rohit Sharma: పాకిస్థాన్ వెళ్లనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకల్లో పాల్గొననున్న భారత సారథి!
- ఐసీసీ ప్రామాణిక పద్దతుల ప్రకారం హాజరుకానున్న అన్ని జట్ల కెప్టెన్లు
- ఫిబ్రవరి 16 లేదా 17న ప్రారంభ వేడుకలకు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న పీసీబీ
దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ అభిమానులను అలరించబోతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. భారత్ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లోనే జరగనున్నాయి. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ఆతిథ్య దేశం పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో ఆరంభ వేడుకలను గ్రాండ్ నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందని, ఫిబ్రవరి 16 లేదా 17న ప్రారంభోత్సవ వేడుకలు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌కు అనుగుణంగా ఓపెనింగ్ సెర్మనీ తేదీ ఖరారవుతుందని తెలిపాయి. ఐసీసీ ప్రామాణిక పద్దతుల ప్రకారం టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల కెప్టెన్లు ప్రారంభ వేడుకలో పాల్గొనాల్సి ఉంటుంది. అందులో భాగంగానే రోహిత్ పాకిస్థాన్ వెళ్లనున్నాడని జాతీయ మీడియా పేర్కొంది.
కాగా, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంకతో కలిసి పాకిస్థాన్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చింది. ఆ దేశంలో జరిగిన ఐసీసీ తొలి ప్రధాన ఈవెంట్ అదే. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఆడే మ్యాచ్‌లు, తొలి సెమీ-ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ అర్హత సాధిస్తే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఇండియా తుది పోరుకు చేరుకోకుంటే లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొననున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.