Tilak Varma: విజయ్ దేవరకొండతో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ సెల్ఫీ.. నెట్టింట ఫొటో వైరల్!
- అనుకోకుండా విమానంలో కలుసుకున్న తిలక్ వర్మ, విజయ్
- ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన యువ ఆటగాడు
- రౌడీబాయ్‌ను కలవడం గొప్పగా ఉందంటూ రాసుకొచ్చిన టీమిండియా ప్లేయర్
టీమిండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అనుకోకుండా విమానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను కలుసుకున్నాడు. దీంతో రౌడీబాయ్‌తో తిలక్ వర్మ సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయాన్ని తిలక్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ విజయ్‌తో కలిసి దిగిన పిక్‌ను పోస్ట్ చేశాడు.
"అన్నా.. నిన్ను విమానంలో అనుకోకుండా కలవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్ను కలవడం గొప్పగా ఉంది" అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తిలక్ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక తిలక్ వర్మ గతేడాది నవంబర్‌లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన విషయం తెలిసిందే. వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
కాగా, ఈ నెల 22 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపిక అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తోనే టీమిండియా ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్‌లో ఇరు జట్లు మూడు వన్డేలు ఆడతాయి. ఫిబ్రవరి 12న ఈ సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ పయనం కానుంది.