Nara Lokesh: సీనియర్ పాత్రికేయుడు గోశాల ప్రసాద్ మృతిపట్ల మంత్రి లోకేశ్ సంతాపం
- ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన గోశాల ప్రసాద్
- ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్న లోకేశ్
- ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేశారని ప్రశంస
సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు గోశాల ప్రసాద్ కన్ను మూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాలలో పలు మీడియా హౌస్ లలో పని చేసిన ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
గోశాల ప్రసాద్ మృతిపట్ల ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. వారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో పనిచేసిన ప్రసాద్ అందరికీ సుపరిచితులని మంత్రి పేర్కొన్నారు.
టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన విశ్లేషణలతో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.