Gautam Gambhir: టీమిండియాలో విభేదాలు?
- సీనియర్ ప్లేయర్ల డిమాండ్లపై కోచ్ గంభీర్ అసంతృప్తి!
- బస చేస్తున్న హోటళ్లు, ప్రాక్టీస్ సమయాలపై పెదవి విరుపు
- గంభీర్ వైపు నుంచి సరైన కమ్యూనికేషన్ లేదంటున్న సీనియర్ ఆటగాళ్లు
- టీమిండియా ఆటగాళ్ల కల్చర్‌పై మరోసారి ఆసక్తికర చర్చ
ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర వైఫల్యంపై బీసీసీఐ ఈ మధ్యనే సమీక్ష నిర్వహించింది. వివరణ ఇచ్చే సమయంలో సీనియర్ ఆటగాళ్లు, గంభీర్ భిన్న స్వరాలు వినిపించినట్టు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ల కల్చర్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఆసీస్ పర్యటనలో కొందరు సీనియర్లు బస చేసిన హోటళ్లు, ప్రాక్టీస్ సమయాలకు సంబంధించి వారి నిర్దిష్ట డిమాండ్లపై పెదవి విరిచినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు, గంభీర్ వైపు నుంచి సరైన కమ్యూనికేషన్ లేదని సీనియర్ ప్లేయర్లు చెప్పినట్టుగా బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మనస్పర్థల నేపథ్యంలో జట్టు ఎంపిక విషయంలో హెడ్ కోచ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వకూడదని జాతీయ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.
గంభీర్ విధానం టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ తరహాలో ఉందని ఓ మాజీ సెలక్టర్ అభిప్రాయపడ్డారు. చాపెల్ శిక్షణా పద్ధతులపై సీనియర్ ఆటగాళ్లు విభేదించేవారని గుర్తుచేశారు. ‘‘ మాజీ కోచ్ రవి శాస్త్రి మాదిరిగా ఉండాలి. ఆయన మీడియాతో స్నేహపూర్వకంగా ఉంటూనే ఆటగాళ్లను అసలు సిసలైన హీరోలుగా అభివర్ణించేవారు. రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్‌స్టన్ లేదా జాన్ రైట్ మాదిరిగానైనా గంభీర్ ఉండాలి. ఈ మాజీ కోచ్‌లు ఆటగాళ్లను లైమ్‌లైట్‌లో ఉంచడానికి వీలు కల్పించారు. భారత్‌లో ‘చాపెల్ విధానం’ పని చేయదు. గంభీర్లు, రవిశాస్త్రులు లేదా ద్రావిడ్‌లు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ఆటగాళ్లు జట్టులో ఉంటారు’’ అని సదరు మాజీ సెలక్టర్ పేర్కొన్నారు.
మరోవైపు, గంభీర్ వ్యక్తిగత సహాయకుడి విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని చోట్లా జట్టును నీడలా వెంటాడడంపై బీసీసీఐ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారని, జాతీయ సెలెక్టర్ల కార్లలో గంభీర్ పీఏ ఎందుకు కూర్చున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీమిండియా ప్లేయర్లకు కేటాయించిన ఫైవ్-స్టార్ హాటళ్ల ప్రాంగణంలో అతడు అల్పాహారం చేయడం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం.