Virat Kohli: ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ లో కోహ్లీ, పంత్ పేర్లు
- ఇటీవల ఫామ్‌లేక తంటాలు పడుతున్న కోహ్లీ
- ఫామ్ అందుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ మాజీల సూచన
- ఈ క్రమంలో ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ లో కోహ్లీ పేరు చేర్చిన డీడీసీఏ
- చివరిసారి 2012లో రంజీ మ్యాచ్ ఆడిన విరాట్
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల ఫామ్‌లేక తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వీరు దేశవాళీ క్రికెట్ ఆడితే గాడిలో పడే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ కూడా ముంబయి రంజీ జట్టుతో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
అయితే, ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. తాజాగా రంజీ ట్రోఫీ తర్వాతి రౌండ్‌లో ఆడేందుకు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ పేర్లను ఢిల్లీ జట్టు తమ ప్రాబబుల్స్ లో చేర్చింది. అయితే, ఈ ట్రోఫీకి కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై సెలక్టర్లు ఇప్పటివరకు ఆయనను సంప్రదించలేదని తెలుస్తోంది.
ఇక చివరిసారి విరాట్ 2012లో రంజీ మ్యాచ్ ఆడాడు. అలాగే రిషభ్ పంత్ 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కనిపించాడు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఈ ఇద్దరి పేర్లను 'అంతర్జాతీయ ప్లేయర్స్' విభాగంలో 38 మంది రాష్ట్ర ఆటగాళ్లతో కలిపి ప్రాబబుల్స్ లో చేర్చింది.
కాగా, ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఢిల్లీకి రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జనవరి 23న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో వారు సౌరాష్ట్రతో తలపడతారు. ఆ తర్వాత రైల్వేస్‌తో చివరి గ్రూప్ దశ మ్యాచ్ ఆడనున్నారు. ఇది జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ కావాలనుకుంటే కోహ్లీ, పంత్ రంజీ బరిలో దిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ జట్టు: ఆయుష్ బదోని, సనత్ సాంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధుల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధు, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కంద్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష త్యాగి, శివంక్ వశిష్ఠ్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోస్జా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, తేయాజా (వికెట్ కీపర్), పార్తీక్, రాహుల్ దాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హర్షిత్ రాణా.