Ajit kumar: అభిమానుల మధ్య మాటల యుద్ధంపై అజిత్ ఏమన్నారంటే..!

Hero Ajit Kumar Comments On Fans War

  • మీ జీవితంపై మీరు దృష్టి పెట్టాలని అభిమానులకు హితవు
  • తన అభిమానులు సంతోషంగా ఉన్నపుడే తనకూ సంతోషమని వ్యాఖ్య
  • జీవితం చాలా చిన్నదని, ఏదో ఒకరోజు అందరమూ వెళ్లిపోతామన్న అజిత్

‘హీరోలపై అభిమానం మంచిదే కానీ ముందు మన జీవితం గురించి ఆలోచించాలి. జై అజిత్.. జై విజయ్.. అంటూ జేజేలు కొడితే నాకూ సంతోషంగానే ఉంటుంది. మరి మీ జీవితం మాటేమిటి? అందుకే, ముందు మీ జీవితం చూసుకున్నాకే ఏదైనా..’ అంటూ హీరో అజిత్ తన అభిమానులకు హితవు పలికారు. సినిమాలు చూడండి, హీరోలను అభిమానించండి కానీ మీ జీవితం గురించి ఆలోచించకుండా అభిమానమే లోకంగా మార్చుకోవద్దని చెప్పారు. తన అభిమానులు సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు తనకూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. పక్కవాడి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం వల్ల ఎవరికీ ఏమాత్రం ఉపయోగం ఉండదని చెప్పారు.

అదే సమయంలో ఇతరులను చూసి హైరానా పడొద్దని, పక్కవాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడనే ఆందోళన వద్దని అన్నారు. జీవితం చాలా చిన్నదని, ఏదో ఒకరోజు అందరమూ వెళ్లిపోతామని చెప్పారు. కష్టపడి పనిచేయండి, సంతోషంగా ఉండండని చెప్పారు. మన ముని మనవలు కూడా మనల్ని గుర్తుపెట్టుకోరనే విషయం గుర్తించాలన్నారు. జరిగిపోయిన దాని గురించి చింతించకుండా ఇప్పుడు ఈ క్షణాన్ని ఆస్వాదించాలని అభిమానులకు సూచించారు. తన అభిమానులు అందరినీ తాను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.

More Telugu News