Yoon Suk Yeol: ఎట్టకేలకు దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్.. తొలి అధ్యక్షుడిగా రికార్డు!
- మార్షల్ లాను ప్రకటించి పీకల మీదికి తెచ్చుకున్న యూన్ సుక్ యోల్
- ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసిన అధికారులు
- అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా యూన్ రికార్డు
అభిశంసనకు గురైన కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టయ్యారు. గతేడాది డిసెంబర్ 3న మార్షల్ లా ప్రకటించి చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బుధవారం అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కొన్ని వారాలుగా ఆయన తన హిల్‌సైడ్ రెసిడెన్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుని నివసిస్తున్నారు. నేడు అక్కడే ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు ఇంటి నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకెక్కాయి.
ఈ తెల్లవారుజామున యాన్ ఇంటికి దాదాపు 3 వేల మందికిపైగా పోలీసులు, అవినీతి నిరోధక విచారణాధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో యాన్‌ను అదుపులోకి తీసుకోకుండా ఆయన మద్దతుదారులు నిలువరించే ప్రయత్నం చేశారు. యాన్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతోపాటు బహిరంగంగా అవమానిస్తున్నారంటూ అధికారులతో ఆయన లాయర్లు వాగ్వివాదానికి దిగారు. కాగా, అధికారంలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి.
అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యాన్ అకస్మాత్తుగా ప్రకటించిన మార్షల్ లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో రాజకీయ గందరగోళానికి గురిచేసింది. దీంతో డిసెంబర్ 14న చట్ట సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి పదవి నుంచి అభిశంసించారు.