Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఆదిలాబాద్ టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. ఒకరి సజీవ దహనం
- 50 మందితో బయలుదేరిన బస్సు
- అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కాలి బూడిదైన బస్సు
- సురక్షితంగా తప్పించుకున్న 49 మంది
- మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన శీలం ధృపత్‌గా గుర్తింపు
ఆదిలాబాద్ నుంచి 50 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బస్సు కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగతా 49 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మృతుడిని నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సీకి చెందిన శీలం ధృపత్ (63)గా గుర్తించారు. డిసెంబర్ 1న బస్సు ఆదిలాబాద్ నుంచి బయలుదేరింది. యాత్రికులు నిన్న సాయంత్రం బృందావన్ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా అనారోగ్య కారణాలతో దురపతి బస్సులోనే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చే సరికి బస్సు కాలి బూడిదై కనిపించింది.
విషయం తెలిసిన కేంద్రమంత్రి బండి సంజయ్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే స్పందించారు. మథుర కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి బాధితులను క్షేమంగా తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులు ప్రస్తుతం పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి ఆర్థిక సాయం కూడా చేసినట్టు తెలిసింది.