South Africa: దక్షిణాఫ్రికా బంగారు గనిలో ఆకలితో అలమటించి 100 మంది మృతి

Death toll rises as South Africa clears illegal gold mine
  • గనిలో చిక్కుకున్న వందలాదిమంది కార్మికులు 
  • గనిలో శవాల కుప్పల వీడియోలు వైరల్
  • మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు
  • వారిని బయటకు రప్పించేందుకు ఆహారం, నీటి సరఫరా మార్గాలను మూసేసిన ప్రభుత్వం
  • ఆకలికి తాళలేక మృత్యువాత పడుతున్న కార్మికులు
  • ఇది విపత్కర పరిస్థితి అంటూ జీఐడబ్ల్యూయూఎస్ అధ్యక్షుడి ఆవేదన
దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనింగ్ కార్మికులు ఆహారం, నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్‌లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (జీఐడబ్ల్యూయూఎస్ఏ) విడుదల చేసింది. ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్ల్వే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు. వాడుకలో లేని స్టింఫోంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు. గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు.  

దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో డిసెంబర్‌లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఉమగోడీ (ఆపరేషన్ క్లోజ్ ద హోల్)ని ప్రారంభించి 13 వేల మంది అక్రమ మైనర్ల(గని కార్మికులు)ను అరెస్ట్ చేసింది. అయితే, అరెస్ట్‌కు భయపడిన మరికొందరు కార్మికులు  2.5 కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్‌ఫోంటీన్ గనిలో తలదాచుకున్నారు. దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం, నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది. దీంతో గదిలోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.

గనిలో మైనర్లు మృత్యువాత పడుతుండటం, వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తమకు సాయం చేయాలని, వెంటనే ఆహారం అందించాలని, తమను బయటకు తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 9 మంది మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు. 26 మందిని రక్షించారు. 

అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు. మూసివేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొల్పుతున్నాయి. దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వీరికి ఆశ చూసి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి.  
South Africa
Illegal Gold Mine
Stilfontein Mine

More Telugu News