Sharad Pawar: నేతల మధ్య మంచి మాటలే కరవయ్యాయి: అమిత్ షా వ్యాఖ్యలకు బదులిచ్చిన శరద్ పవార్
- నిన్న షిర్డీలో శరద్ పవార్ పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
- నేడు రిప్లయ్ ఇచ్చిన శరద్ పవార్
- 1978లో తాను సీఎంగా పనిచేశానని వెల్లడి
- అప్పుడీ అమిత్ షా ఎక్కడున్నాడంటూ ఆగ్రహం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన విమర్శలకు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ బదులిచ్చారు. ప్రస్తుత కాలంలో రాజకీయ నేతల మధ్య మంచి మాటలే కరవయ్యాయని అన్నారు. ఒకప్పుడు నేతల నడుమ సరైన భావవ్యక్తీకరణ ఉండేదని, ఇప్పుడది లోపించిందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి పదవికి ఎంతో హుందాతనం ఉంటుందని, దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని అమిత్ షాకు హితవు పలికారు.
"గతంలో హోంమంత్రులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్, యశ్వంతరావు చవాన్, శంకర్ రావు చవాన్ వంటి వారు పనిచేశారు. మహారాష్ట్ర పొరుగునే ఉన్న గుజరాత్ నుంచి కూడా ఎందరో సమర్థులైన పాలకులు వచ్చారు. కానీ ప్రస్తుత హోంమంత్రి నిన్న షిర్డీలో ప్రసంగించారు. ప్రసంగించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అమిత్ షా 1978 నాటి నా రాజకీయాలను ప్రస్తావించారు.
1978లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పుడీ అమిత్ షా ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. నా హయాంలో ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతలు ప్రమోద్ మహాజన్, వసంత్ రావు భగవత్ కూడా ఎంతగానో సహకరించేవారు. అప్పటి నేతల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండేది. ఇప్పుటి రాజకీయ నేతల్లో అది మచ్చుకైనా కనిపించకపోవడం శోచనీయం" అని శరద్ పవార్ వివరించారు.
నిన్న అమిత్ షా షిర్డీలో మాట్లాడుతూ, శరద్ పవార్ పై దుమ్మెత్తిపోశారు. 1978లో వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని, విశ్వాస ఘాతక రాజకీయాలకు పాల్పడిన ఆయనకు మహారాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ద్వారా ప్రజలు వెన్నుపోటు రాజకీయాలను, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే కుటుంబ వారసత్వ రాజకీయాలను 20 అడుగుల లోతున భూస్థాపితం చేశారని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.