Jalli Kattu: తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు... ప్రైజులు మామూలుగా లేవు!
- తమిళనాడులో పొంగల్ పండుగ కోలాహలం
- మధురై జిల్లా అవనియపురంలో జల్లికట్టు షురూ
- ఎవరికీ లొంగని ఎద్దు యజమానికి ట్రాక్టర్ బహూకరణ
- ఎద్దును లొంగదీసే వ్యక్తికి బహూమతిగా రూ.8 లక్షల కారు
తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి ఎలాగో, తమిళనాడుకు పొంగల్ పండుగ అలాంటిది. ఏపీలో సంక్రాంతికి కోడిపందాలు వేయడం ఆనవాయతీ. తమిళనాడులోనూ అంతే... అయితే ఇక్కడ కోడిపందాలకు బదులు జల్లికట్టు పేరిట ఎద్దులతో మనుషులు పోటీ పడే సాహస క్రీడను నిర్వహిస్తుంటారు. తమిళనాడు సంస్కృతి సంప్రదాయాల్లో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టుకు విశిష్ట స్థానం ఉంది.
ఇవాళ సంక్రాంతి నేపథ్యంలో, తమిళనాడులో జల్లికట్టు పోటీలకు తెరలేచింది. వీటన్నింట్లోకి మధురై జిల్లాలో అవనియపురంలో జరిగే జల్లికట్టు పోటీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అవనియపురంలో జరిగే జల్లికట్టు పోటీల కోసం 1,100 ఎద్దులను సిద్ధం చేశారు. బాగా మదించిన ఆ ఎద్దుల కొమ్ములు వంచేందుకు 900 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
పోటీలో ఎవరికీ లొంగకుండా పరుగు తీసే ఎద్దు (యజమానికి)కు మొదటి బహుమతిగా రూ.11 లక్షల విలువ చేసే ట్రాక్టర్ బహూకరించనున్నారు. అలాగే, ఎద్దును సమర్థంగా కట్టడి చేసి విజేతగా నిలిచిన యోధుడికి రూ.8 లక్షల విలువ చేసే కారును బహూకరించనున్నారు.