Makara Vilakku: శబరిమలలో మకరజ్యోతి దర్శనం... పులకించిన భక్తులు
- నేడు సంక్రాంతి
- ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండల్లో దివ్య జ్యోతి దర్శనం
- అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరి గిరులు
అయ్యప్ప భక్తులు జీవితంలో ఒక్కసారైనా శబరిమలలో మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై అయ్యప్ప స్వామి దివ్య జ్యోతి దర్శనమిస్తుంది.
ఇవాళ సంక్రాంతి పండుగ నేపథ్యంలో, నేటి సాయంత్రం పొన్నాంబలమేడు కొండల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఈ జ్యోతిని స్వామివారి అంశగా భావించే అయ్యప్ప భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. మకర జ్యోతి కనిపించడంతో శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి.
మకర జ్యోతిని ప్రత్యక్షంగా 1.5 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా. కాగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శబరిమల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.