Laurene Powell Jobs: మహా కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత
- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నాడు ప్రారంభమైన మహా కుంభామేళా
- ఈ కుంభామేళాకు క్యూ కడుతున్న విదేశీయులు
- నిన్న ఈ మహా కుంభమేళాకు హాజరైన స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్
- ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న లారీన్
- కొత్త వాతావరణం కారణంగా ఆమెకు స్వల్ప అస్వస్థత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నాడు మహా కుంభామేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు త్రివేణి సంగమం వద్ద 1.50 కోట్ల మంది పుణ్య స్నానం ఆచరించారు. ఈ కుంభామేళాకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. యాపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ నిన్న ఈ మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో లారీన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ వెల్లడించారు. ప్రస్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని చెప్పారు.
ఇక లారీన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని ఆయన తెలిపారు. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళుతుంటారని గిరి మహారాజ్ పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు.
ఇదిలాఉంటే... ఈసారి 45 రోజుల పాటు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ జనజాతరైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి 40 కోట్ల మంది వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభామేళా జరగనుంది.