Ramcharan: నా హృదయంలో 'గేమ్ ఛేంజర్'కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం... ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ లేఖ!
- రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ 'గేమ్ ఛేంజర్'
- ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
- ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్న చెర్రీ
- ఈరోజు సంక్రాంతి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మూవీ లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా 'గేమ్ ఛేంజర్'పై చెర్రీ అభిమానులకు ఒక లేఖ విడుదల చేశారు.
ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నట్లు రామ్ చరణ్ పేర్కొన్నారు. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. "గేమ్ ఛేంజర్ కోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సినిమా విజయంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. పాజిటివ్ రివ్యూలు, ప్రోత్సాహాన్ని ఇచ్చిన మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్.
2025కు పాజిటివ్‌గా స్వాగతం చెప్పాం. ఇకపై కూడా మంచి పెర్ఫార్మెన్స్‌లు ఇస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నా. నా హృదయంలో 'గేమ్ ఛేంజర్'కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది కూడా మీ అందరికీ అద్భుతమైన సంవత్సరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ రామ్ చరణ్ లేఖలో రాసుకొచ్చారు.
అలాగే 'గేమ్ ఛేంజర్'లో అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్‌కు బిగ్ థ్యాంక్స్ అంటూ ఈ లెటర్‌కు క్యాప్షన్ పెట్టారు చెర్రీ. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు.
చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.