BCCI: ఆటగాళ్లతో పాటు కోచ్ గంభీర్‌కు షాకిచ్చేందుకు రెడీ అయిన బీసీసీఐ... ఇకపై అవన్నీ కట్!
- విదేశీ పర్యటనలో ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు ఉండే కాలపరిమితి తగ్గింపు
- దీనికోసం 2019కి ముందు ఉన్న రూల్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయం
- 45 రోజుల పర్యటనలో 14 రోజుల పాటు ఆటగాళ్లతో పాటు కుటుంబాలు ఉండేందుకు అనుమతి
- ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛకు కత్తెర
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు గతేడాది టెస్టుల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన టీమిండియా ప్లేయర్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు బీసీసీఐ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై కొన్ని కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇప్పటివరకు సుదీర్ఘ పర్యటనలలో ఆటగాళ్ల కుటుంబాలు, ముఖ్యంగా భార్యలు వారితో పాటు బస చేసేందుకు స్వేచ్ఛ ఉండేది.
అయితే, భారత బోర్డు ఇప్పుడు ఈ విషయంలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఎక్కువ కాలం ఉంటే విదేశీ పర్యటనలలో వారి ప్రదర్శన ప్రతికూలంగా ప్రభావితమవుతుందని బీసీసీఐ భావిస్తోందని దైనిక్ జాగరణ్ కథనం పేర్కొంది. అందువల్ల, ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేస్తూ 2019కి ముందు ఉన్న రూల్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
దైనిక్ జాగరణ్‌లోని కథనం ప్రకారం.. 45 రోజుల పర్యటనలో రెండు వారాల పాటు ఆటగాళ్లతో పాటు కుటుంబాలు, ముఖ్యంగా భార్యలు ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చేది. ఇప్పుడు మళ్లీ ఇదే నిబంధనను అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. అంతేగాక ప్రతి ఆటగాడు జట్టులోని ఇతర సభ్యులతో కలిసి జట్టు బస్సులో ప్రయాణించవలసి ఉంటుంది. ఒంటరి ప్రయాణాన్ని కూడా బోర్డు రద్దు చేయాలని నిర్ణయించింది.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, రోహిత్ శర్మ అర్ధాంగి రితికా సజ్దే, కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి వంటి ఇతర క్రికెటర్ల భార్యలు విదేశీ పర్యటనలలో తరచుగా కనిపించేవారు. ఇకపై పూర్తి పర్యటనల కోసం క్రికెటర్ల భార్యలు వెళ్లలేరు. ఆటగాళ్లు కుటుంబసభ్యులతో కలిసి ఉండేందుకు ఇకపై కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గౌతమ్ గంభీర్ స్వేచ్ఛకు కత్తెర
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇప్పటివరకు ఇచ్చిన స్వేచ్ఛకు కూడా కత్తెర వేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. అతని మేనేజర్ గౌరవ్ అరోరాకు కూడా బీసీసీఐ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించిందట. ఇకపై గంభీర్ మేనేజర్‌ని టీమ్ బస చేసే హోటల్‌లో ఉండేందుకు అనుమతించరు. అలాగే స్టేడియాలలో వీఐపీ బాక్స్‌లో కూర్చోబెట్టేందుకు కూడా అనుమతి ఉండదట. అంతేగాక గంభీర్‌తో పాటు టీమ్ బస్సులో మేనేజర్‌ని అనుమతించరని సమాచారం.
విమాన ప్రయాణ సమయంలో 150 కిలోల బరువు దాటితే ఆటగాళ్ల లగేజీకి ఇకపై బీసీసీఐ చెల్లించదని కథనం పేర్కొంది. ఆ ఎక్స్‌ట్రా లగేజీ ఖర్చును ఆటగాళ్లు స్వయంగా భరించాలట.
భారత టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ శనివారం నాడు బీసీసీఐ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్‌తో సహా వెటరన్ స్టార్‌ల భవిష్యత్తు, అలాగే గంభీర్ కోచింగ్ స్టాఫ్ పదవీకాలం తదితర అంశాలు ఇందులో ఉన్నాయట.
జట్టులో సహాయక సిబ్బంది పదవీకాలాన్ని మూడేళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించిటన్లు తెలుస్తోంది. కొంతమంది సహాయక సిబ్బంది చాలా కాలంగా జట్టుతో ఉన్నందున ప్రదర్శనలు మందగించాయని బీసీసీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలంటే మెరుగైన ప్రదర్శన ఉండాల్సిందేనని నిర్ణయించినట్లు తెలుస్తోంది.