Pigs Fight: ఏపీలో కోడిపుంజులతోనే కాదు... పందులతోనూ పందాలు.... వీడియో ఇదిగో!
- సంక్రాంతి సీజన్ అంటే కోడిపందాలకు ఫేమస్
- తాడేపల్లిగూడెం మండలంలో పందుల పందాలు
- తరతరాలుగా వస్తున్న ఆచారం అంటున్న నిర్వాహకులు
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు... ఏపీ కోస్తా జిల్లాల్లో ఎక్కడ చూసినా కోడిపందాల సందడి కనిపిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజులు ఇళ్లలో పండుగ శోభ కనిపిస్తే... గ్రామాల శివార్లు, ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కోడిపందాల కోలాహలం మిన్నంటుతుంది. సంక్రాంతికి ఇది సాధారణంగా కనిపించే సీన్!
అయితే, ఇదే సందట్లో పందుల పందాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ పందుల పందాలకు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం వేదికగా నిలిచింది. దేశవాళీ పందులు, సీమ పందులు.... ఇలా వేర్వేరు జాతుల పందులను బరిలో దింపి, పోటీలు నిర్వహించారు. ఆ వరాహాలు పౌరుషంతో పోరాడుతుండగా, జనాలు ఎంచక్కా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
కాగా, పందుల పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదని, పందుల పోటీలు నిర్వహించడం తమకు తరతరాలుగా వస్తున్న ఆచారం అని నిర్వాహకులు చెబుతున్నారు.