Harish Rao: తొందరపడి అరెస్ట్ చేయొద్దు: డీజీపీ, పోలీసులకు హరీశ్ రావు విజ్ఞప్తి

Harish Rao to DGP and Police on arrests

  • రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్ట్ చేయవద్దన్న హరీశ్ రావు
  • కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేమిటని ప్రశ్న
  • పండుగ చేసుకోనీయకుండా అరెస్ట్ చేయడమేమిటని తలసాని ఆగ్రహం

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌, బెయిల్ రావడంపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హరీశ్ రావు మాట్లాడుతూ... రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బెయిలబుల్ సెక్షన్లలో అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 

నాయకులు చెప్పినట్లు పోలీసులు వినడం సరికాదన్నారు. బెయిలబుల్ కేసుల్లో స్టేషన్ బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పాయని గుర్తు చేశారు. పండుగ రోజున ఓ తీవ్రవాదిలా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకు వెళ్లారని, రాత్రంతా దోమలు కుడుతున్నప్పటికీ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని మండిపడ్డారు.

పండుగ కూడ చేసుకోనీయకుండా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడమేమిటని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్బంధాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం సరికాదన్నారు. న్యాయమైన పోరాటం చేస్తామని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పోరాడతామన్నారు.

More Telugu News