Turmeric Board: నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి గోయల్
- కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్
- పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం
- ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందూరు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ. కేంద్రం నిన్న ఈ పసుపు బోర్డు మంజూరు చేయడంతో పాటు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించింది. గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో అందులో పేర్కొనలేదు. నిజామాబాద్‌లో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిన్నప్రకటించారు.