Padi Kaushik Reddy: ఈరోజు.. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు మాట్లాడవద్దనుకుంటున్నా!: కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి
- బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే
- నిన్నటి నుంచి తన విషయంలో హైడ్రామా జరిగిందన్న ఎమ్మెల్యే
- తనకు కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ శ్రేణుల వరకు అండగా నిలిచారని వెల్లడి
ఈరోజు సంక్రాంతి జరుపుకుంటున్నామని, ఈ పండుగ రోజున ఎలాంటి రాజకీయాలు మాట్లాడవద్దనుకుంటున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఆయనకు బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... రేపు హైదరాబాద్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు.
నిన్నటి నుంచి తన విషయంలో హైడ్రామా జరుగుతోందని, ఈ సమయంలో తనకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. వారందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నా కష్టకాలంలో మీరంతా అండగా నిలిచారన్నారు.
కోర్టును కూడా మనం గౌరవించాల్సి ఉందన్నారు. కరీంనగర్ పట్టణ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టవద్దని కోర్టు షరతు విధించిందన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నిద్ర లేకుండా రాత్రంతా ఈ హడావుడిని కవర్ చేశారని, ఇందుకు ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.