Cricket: టీమిండియా కెప్టెన్సీ రేసులో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు.. దక్కేది ఎవరికో?

- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు భంగపాటు
- రోహిత్‌శర్మ వారసుడిపై సర్వత్ర చర్చ
- పరిశీలనలో బుమ్రా, జైస్వాల్, పంత్ పేర్లు
- ముగ్గురి విషయంలోనూ సెలక్టర్ల డైలమా
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణ పరాభవం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సారథి రోహిత్‌శర్మ వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది. రోహిత్ ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఇటీవల అతడి రిటైర్మెంట్‌పైనా వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, ఆ తర్వాత అతడు మనసు మార్చుకున్నాడని, మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగుతాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడి తర్వాత జట్టును నడిపించేది ఎవరన్న చర్చ మొదలైంది.
ఈ విషయంలో వైస్ కెప్టెన్ బుమ్రా పేరు మొదటి వరుసలో ఉండగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే, అతడి ఫిట్‌నెస్ చుట్టూ సందేహాలు నెలకొనడంతో అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సెలక్టర్లు జంకుతున్నారు.
మరోవైపు, యువ ఆటగాడు జైస్వాల్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కెప్టెన్‌గా అతడైతే బాగుంటుందని కోచ్ గంభీర్ భావిస్తున్నాడట. అయితే, జైస్వాల్ ఇంకా కెరియర్ తొలి దశలోనే ఉండటంతో అతడిని ఎంపిక చేస్తే విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం రిషభ్‌పంత్ వైపు మొగ్గు చూపుతున్నాడు. పంత్‌కు కెప్టెన్సీ సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మరీ దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యతే లేనట్టు ఆడతాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకుంటారా? లేదంటే మరో ఆటగాడిని తెరపైకి తీసుకొస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.