Srivari Parakamani: శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కట్ చోరీ కేసులో ఆసక్తికర అంశం వెల్లడి

- ఇటీవల పరకామణిలో బంగారు బిస్కెట్ చోరీ చేసిన పెంచలయ్య
- బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పెంచలయ్య
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు చెప్పిన వైనం
- గతంలోనూ పరకామణి నుంచి బంగారం ఎత్తుకెళ్లానని వెల్లడి
తిరుమల పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ చేస్తూ దొరికిపోయిన తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. పెంచలయ్య చోరీ చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ పలుమార్లు తన చేతివాటం చూపించినట్టు గుర్తించారు.
పెంచలయ్య అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా తిరుమల పరకామణిలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బును సంపాదించాలన్న ఉద్దేశంతో పరకామణి గోల్డ్ స్టోరేజీ నుంచి బంగారం తస్కరించడం మొదలుపెట్టాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగిలించి చెత్తను తరలించే ట్రాలీకి ఉన్న పైపులో దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య అక్కడి నుంచి పరారయ్యాడు.
విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తిరుమల వన్‌టౌన్ పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నంచడంతో గత చోరీల విషయం వెలుగు చూసింది. అతడి నుంచి 555 గ్రాముల బంగారం బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.