Jaym Ravi: ఇక నుంచి నన్ను ఈ పేర్లతోనే పిలవండి: జయం రవి

- తనను రవి మోహన్ లేదా రవి అని పిలవాలని విజ్ఞప్తి
- జయం రవి అని పిలవొద్దని స్పష్టీకరణ
- పొంగల్ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభం
తమిళ హీరో జయం రవి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి కూడా సుపరిచితుడే. సినీ ప్రముఖుడు ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. జయం సినిమాతో హిట్ కొట్టి జయం అనే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అయితే, ఇక నుంచి తనను జయం రవి అని పిలవొద్దని ఈ వెర్సటైల్ హీరో స్పష్టం చేస్తున్నాడు.
పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన జయం రవి... ఇక నుంచి తనను రవి మోహన్ అని పిలవాలని, లేకపోతే సింపుల్ గా రవి అని అయినా పిలవాలని తెలిపారు. పొంగల్ వేళ తాను కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నానని, రవి మోహన్ స్టూడియోస్ పేరిట ప్రొడక్షన్ సంస్థను స్థాపిస్తున్నానని వివరించారు. దయచేసి ఇక నుంచి తనను జయం రవి అని పిలవొద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
ఇక తాను స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహిస్తానని, అర్థవంతమైన కథలను తన బ్యానర్ ద్వారా తెరకెక్కిస్తామని వివరించారు. ఇక తన ఫ్యాన్ క్లబ్బులన్నింటినీ ఏకం చేసి ఓ ఫౌండేషన్ గా మార్చుతానని జయం రవి వెల్లడించారు. అభిమానులే తన బలం అని పేర్కొన్నారు.
అంతేకాదు, సోషల్ మీడియాలోనూ తన కొత్త పేరుతో ప్రొఫైల్ మార్చుకున్నారు.
