Stock Market: నాలుగు సెషన్‌లలో 24 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Investors Lose Rs 24 Lakh Crore

  • మార్కెట్ నష్టాలకు ముడి చమురు ధరల పెరుగుదల సహా పలు కారణాలు
  • ఈరోజు వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
  • రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు

భారత స్టాక్ మార్కెట్ గత నాలుగు సెషన్‌లలో భారీగా నష్టపోయింది. ఈ నాలుగు సెషన్‌లలో ఇన్వెస్టర్లు రూ.24.69 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, నిరంతర విదేశీ నిధుల ఉపసంహరణ వంటి అంశాలు ప్రభావం చూపాయి. అలాగే, అమెరికా డాలర్‌తో రెండేళ్లలో తొలిసారి జీవిత కాల కనిష్ఠానికి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 1,048 పాయింట్లు నష్టపోయి 76,330 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,69,243 కోట్లు క్షీణించి రూ.4,17,05,906 కోట్లుగా నమోదైంది. ఈన్వెస్టర్లు నేడు రూ.12.61 లక్షల కోట్లు నష్టపోయారు. 

నెగెటివ్ సెంటిమెంట్ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో రూ.20 వేల కోట్ల విలువ గల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రష్యా ముడి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ 1.43 శాతం పుంజుకుని 80.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బీఎస్‌ఈలో 3,562 షేర్లు నష్టపోగా, 555 స్టాక్స్ లాభపడ్డాయి. మరో 131 స్టాక్స్ యథాతథంగా కొనసాగాయి.

  • Loading...

More Telugu News