Trinath Rao: నటి అన్షుపై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథరావు

- తన మాటల వల్ల బాధపడిన వారికి క్షమాపణలు అంటూ వీడియో విడుదల
- అందరూ పెద్ద మనసు చేసుకొని క్షమించాలన్న త్రినాథరావు
- తెలిసి చేసినా... తెలియక చేసినా తప్పేనని వ్యాఖ్య
టాలీవుడ్ ప్రముఖ నటి అన్షుపై చేసిన వ్యాఖ్యలకు గాను దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల బాధపడిన అన్షుకు, మహిళలందరికీ తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. ఎవరినీ బాధించడం తన ఉద్దేశం కాదన్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు. అందరూ పెద్ద మనసు చేసుకొని తనను క్షమించాలని వేడుకున్నారు. ఈ మేరకు త్రినాథరావు వీడియో విడుదల చేశారు.
నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన తన కొత్త సినిమా 'మజాకా' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అన్షుపై దర్శకుడు త్రినాథరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరాకృతి గురించి మాట్లాడారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అలాగే సెకండ్ హీరోయిన్ పేరు... అంటూ కాసేపు మరిచిపోయినట్లుగా ఆగారు. అదే సమయంలో తాగడానికి నీళ్లు అడిగారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు చెప్పారు.