Maha Kumbh Mela: బాప్‌రే బాప్.. మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ కి ఇంత భారీ ఆదాయమా...!

- ఈరోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా ప్రారంభమైన మహా కుంభమేళా
- ఈసారి 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా
- యూపీ ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం
12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద 50 లక్షల మందికి పైగా భక్తులు మొదటి పవిత్ర స్నానం ఆచరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మానవాళి సభగా పేర్కొనబడిన ఈ సహస్రాబ్దాల నాటి కుంభమేళా ఈసారి ప్రయాగ్‌రాజ్‌కు 40 కోట్ల మందికి పైగా భక్తులను తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సుమారు 4,000 హెక్టార్లలో ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనుంది.
45 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం యూపీ ప్రభుత్వం ఏకంగా రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇక ఈ భారీ ఈవెంట్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఖజానాకు అంతే భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని అంచనా.
మహా కుంభమేళా ద్వారా యూపీ ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయం
మహా కుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్ కి రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 40 కోట్ల మంది సందర్శకులు ఒక్కొక్కరు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఈ మెగా ఈవెంట్ ద్వారా రూ. 2 లక్షల కోట్ల వరకు ఉత్తరప్రదేశ్ రాష్త్రం ఆర్జించవచ్చని చెబుతున్నాయి.
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ట్రేడ్ వర్గాల అంచనాలను ఉటంకిస్తూ, ఒక వ్యక్తి సగటు వ్యయం రూ. 10,000 వరకు పెరగవచ్చని తెలిపింది. తద్వారా మొత్తం ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. ఇది ఆ రాష్ట్ర నామమాత్ర, వాస్తవ జీడీపీ రెండింటినీ 1 శాతానికి పైగా పెంచుతుందని అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... 2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించిందని అన్నారు. ఆ ఈవెంట్‌ను దాదాపు 24 కోట్ల మంది భక్తులు సందర్శించినట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని, రూ. 2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌తో అన్నారు.