Virat Kohli: విరాట్ కోహ్లీకి అంబటి రాయుడు నచ్చలేదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

- 2019 వన్డే వరల్డ్ కప్‌కు రాయుడు సెలక్ట్ కాకపోవడానికి కోహ్లీయే కారణమన్న ఉతప్ప
- ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్లేయర్లను జట్టులోకి తీసుకునేవాడన్న మాజీ క్రికెటర్
- కోహ్లీకి నచ్చకపోతే ఏ ఆటగాడైనా మంచివాడు కానట్టేనంటూ ఆరోపణలు
మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ ముందుగా ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే కారణమంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేసుకునేవాడని ఆరోపించాడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంటే కోహ్లీకి నచ్చేది కాదని, అందుకే 2019 వన్డే ప్రపంచ కప్ భారత జట్టు నుంచి రాయుడిని తప్పించారని వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీకి ఏ ఆటగాడైనా నచ్చకపోతే అతడు ఎవరైనా సరే మంచివాడు కానట్టేనని, అందుకు అంబటి రాయుడే చక్కటి ఉదాహరణ అని ఉతప్ప పేర్కొన్నాడు. ‘‘కెప్టెన్‌గా ఎవరికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ, ఇష్టాయిష్టాల ఆధారంగా ఒక ఆటగాడి అవకాశాలపై నీళ్లు చల్లకూడదు. రాయుడి వద్ద ప్రపంచ కప్ జెర్సీ, ప్రపంచ కప్ కిట్ బ్యాగ్ ఉన్నాయి. కాబట్టి, ప్రపంచ కప్‌లో ఆడతాననే అతడు భావించి ఉంటాడు. కానీ, దారులు మూసివేశారు. ఇలా చేయడం నా దృష్టిలో సబబు కాదు’’ అని ఉతప్ప అన్నాడు. హిందీ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, 2019 వన్డే ప్రపంచ కప్‌కు అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ, చివరి నిమిషంలో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. సెలక్టర్ల ఎంపిక పెద్ద వివాదాస్పదమైంది. భారత క్రికెట్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లపై దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. రాయుడిని తప్పించడంలో సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ కీలక పాత్ర పోషించారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో కోహ్లీ పాత్ర ఉందని ఉతప్ప చెప్పడం చర్చనీయాంశంగా మారింది.