Manohar Lal Khattar: నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

- బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అర్హులన్న మనోహర్ లాల్ ఖట్టర్
- మునుపెన్నడూ లేని రీతిలో అంబేద్కర్‌ను బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తోందన్న మాజీ ముఖ్యమంత్రి
- యాదృచ్ఛికంగా సీఎం అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ కాంగ్రెస్ కౌంటర్లు
జవహర్‌లాల్ నెహ్రు యాదృచ్ఛికంగా దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అర్హులని ఆయన అన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవించడంలో బీజేపీ పాత్ర అనే అంశంపై మాట్లాడుతూ ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం. దీనిని రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని ఎల్లకాలం మనం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన చనిపోతే అంత్యక్రియలకు ఢిల్లీలో కనీసం చోటు కూడా ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో అంబేద్కర్‌ను గౌరవిస్తోంది. అంబేద్కర్ పేరుతో ఐదు పవిత్ర స్థలాలను ఏర్పాటు చేసింది’’ అని పేర్కొన్నారు.
కాగా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఢిల్లీలో స్థలం కేటాయించిన నేపథ్యంలో ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హర్యానా మాజీ సీఎం భూపిందర్ హుడా కౌంటర్ ఇచ్చారు. యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.