Yograj Singh: ఆ సమయంలో నా కొడుకు చనిపోయినా నేను గర్వపడేవాడిని.. యువరాజ్ తండ్రి యోగరాజ్ కీలక వ్యాఖ్యలు!

- 2011 ప్రపంచ కప్ సమయంలో యువీ మరణించినా తాను గర్వపడేవాడినన్న యోగరాజ్
- 2011 వన్డే వరల్డ్‌కప్‌లో దేశం కోసం యువీ చేసిన దానికి యావత్ భారత్ నేటికీ అతడిని ప్రశంసిస్తుందని వ్యాఖ్య
- ఒకవైపు క్యాన్సర్‌తో పోరాడుతూ మరోవైపు మన దేశానికి ప్రపంచకప్ గెలిపించాడని ప్రశంస
2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లో దేశం కోసం యువరాజ్ సింగ్ చేసిన దానికి యావత్ భారతదేశం నేటికీ అతడిని ప్రశంసిస్తుందని తండ్రి యోగరాజ్ సింగ్ అన్నారు. 2011 ప్రపంచ కప్ సమయంలో యువరాజ్ మరణించినా తాను గర్వపడేవాడినని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఎందుకంటే దేశానికి ఒంటిచెత్తో టైటిల్ అందించిన వీరుడులాంటి వాడు తన కుమారుడు అని చెప్పుకొచ్చారు.
“యువరాజ్ సింగ్ ఒకవైపు క్యాన్సర్‌తో పోరాడుతూ మరోవైపు మన దేశానికి ప్రపంచకప్ గెలిపించాడు. ఆ సమయంలో అతడు చనిపోయి, భారతదేశానికి ప్రపంచ కప్ గెలిచి ఉంటే, నేను తండ్రిగా గర్వపడేవాడిని. నేను ఇప్పటికీ అతని గురించి చాలా గర్వపడుతున్నాను. నేను ఈ విషయం అతనికి ఫోన్‌లో కూడా చెప్పాను. ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో ఓ మ్యాచ్‌లో అతను రక్తపు వాంతి చేసుకున్నాడు. ఆ సమయంలో నేను అతనికి చెప్పాను... 'చింతించకండి, మీరు భారత్‌కు ఈ ప్రపంచ కప్‌ను గెలవరు' " అని యోగరాజ్ అన్‌ఫిల్టర్‌డ్ బై స్యామ్దీష్ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లలో ఒకరైన యువరాజ్ సింగ్ భారత క్రికెట్ పట్ల చూపిన నిబద్ధత అసమానమైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ 2011 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 90.50 సగటు, 86.19 స్ట్రైక్ రేట్‌తో 362 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. దాంతో ఈ ఐసీసీ టోర్నీలో యువీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. టోర్నీ ముగిసిన తర్వాతే యువరాజ్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ వన్డే ప్రపంచకప్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కోలుకున్న యువీ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 2019 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ అదే ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.