Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు చేసిన పోలీసులు

- కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో గందరగోళం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదం
- కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంజయ్ కుమార్ పీఏ
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో... కౌశిక్ రెడ్డిపై సంజయ్ కుమార్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా కలెక్టరేట్ లో బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం సృష్టించి, సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదయింది.
నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదిరి ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా తోసుకోవడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.