Govt Star Hotel: మూడెకరాల్లో 15 అంతస్తులు.. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్టార్ హోటల్!

- హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మూడు ఎకరాల్లో నిర్మాణం
- ఖర్చు రూ. 582 కోట్లు.. మూడేళ్లలో నిర్మాణం పూర్తి
- ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐసీ
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతంలో స్టార్ హోటల్ ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మూడు ఎకరాల స్థలంలో దీనిని నిర్మిస్తారు. అత్యంత అధునాతన వసతులతో మొత్తం 15 అంతస్తుల్లో దీనిని నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 582 కోట్లు వెచ్చించనుంది. ప్రపంచంలోని టాప్-10 హోటళ్లలో ఒకటిగా ఉండేలా అత్యంత లగ్జరీగా దీనిని నిర్మిస్తారు. ఈ మేరకు అర్హులైన బిడ్డర్ల నుంచి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) టెండర్లు ఆహ్వానించింది. మూడేళ్లలోనే దీనిని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా మార్చడం, పరిశ్రమలను తీసుకురావడం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు మంచి అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హోటల్‌ను ఇప్పటికే నిర్మించతలపెట్టిన టైమ్‌స్క్వేర్, టీ-వర్క్స్ భవనాలతో అండర్‌గ్రౌండ్, అండర్‌పాస్‌లతో అనుసంధానించనుంది.