Thrinadha Rao Nakkina: టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో నటిపై దర్శకుడు అసభ్యకర వ్యాఖ్యలు

టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో ఓ నటిపై దర్శకుడు త్రినాథరావు నక్కిన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు ‘మజాకా’ మూవీని రూపొందించారు. రీతూవర్మ కథానాయిక. రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది.
సంక్రాంత్రి పండుగను పురస్కరించుకుని నిన్న టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన్మథుడు సినిమా చూసినప్పుడు ఆమె లడ్డూలా ఉందని అనుకునేవారమని, ఆమెను చూసేందుకే సినిమాకు వెళ్లే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన సినిమాలో ఆమెను చూసి ఆశ్చర్యపోయానని, చాలా సన్నబడిందంటూ బాడీ షేప్స్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే తెలుగు ప్రేక్షకులు చూడరని, కాబట్టి.. అంటూ బాడీ షేప్స్‌పై సలహాలతో కూడిన కామెంట్స్ చేశారు. తను చెప్పిన సలహాను ఆమె పాటించిందని కూడా చెప్పడంతో వేదికపై ఉన్నవారు ఒక్కసారిగా షాకయ్యారు.
అంతకుముందు యాంకర్ గీతా భగత్‌తోనూ త్రినాథరావు ఇలానే ఆయన ప్రవర్తించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఆమె షేక్ హ్యాండ్ ఇస్తే.. టచ్ బాగుందని, పండగ పూట బోణీ బాగుందని వెకిలి వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.